ప్రపంచ తెలుగు ప్రతిభను సత్కరించనున్న మాటా..
ఫిలడెల్ఫియాలో మాటా రెండో మహాసభలకు సన్నాహాలు..
అమెరికాలోని తెలుగు సమాజానికి మరొక ప్రత్యేక వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో జూన్ నెలలో జరగనున్న రెండో మహాసభల సందర్భంగా ‘మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ను ఘనంగా ప్రదానం చేయనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన తెలుగు వారిని గుర్తించి గౌరవించేందుకు ఈ అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ మహాసభలు జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్ (The Greater Philadelphia Expo Center)లో అత్యంత వైభవంగా జరగనున్నాయి. అమెరికాలో నివసిస్తున్న వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన తెలుగు వారికి ఈ వేదికపై అవార్డులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈసారి అవార్డులను పలు విభాగాల్లో అందించనున్నారు. వ్యాపారం, సమాజ సేవ, సాహిత్యం, జర్నలిజం, సాంస్కృతిక సేవ, యువత, క్రీడలు, ఇంజనీరింగ్ & ఐటీ, సైన్స్ & టెక్నాలజీ, వైద్యం, అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ వంటి విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని నామినేట్ చేయవచ్చు. సమాజంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు చెబుతున్నారు.
నామినేషన్లు పంపాలనుకునే వారు అర్హత, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవలో చేసిన సేవల వివరాలతో awards@mata-us.org అనే ఈమెయిల్ కు దరఖాస్తు చేయాలి. మే 18, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. తెలుగు సమాజంలో ప్రతిభను వెలికితీసి, సేవా భావాన్ని ప్రోత్సహించే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మటా సభ్యులు కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు.