ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఆరోగ్య శాఖ నూతన నియామకాలను చేపట్టింది. మొత్తం 227 మంది పీజీ పూర్తిచేసిన స్పెషలిస్టు వైద్యులను రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆసుపత్రుల్లో నియమించనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా కౌన్సెలింగ్ విధానంలో జరిగాయని మంత్రి వివరించారు. 12 విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులను ఆయా విభాగాల అవసరాల ఆధారంగా కేటాయించారు. వీరిలో 33 ఏరియా ఆసుపత్రులకు 60 మంది, ఏడు జిల్లా ఆసుపత్రులకు 10 మంది, రెండు ఎంసీహెచ్ ఆసుపత్రులకు ఇద్దరు స్పెషలిస్టులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. గూడూరు ఏరియా ఆసుపత్రికి ఎక్కువ మంది నిపుణులు కేటాయించబడ్డారు.
నియమితులైన వైద్యుల్లో గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో 35 మంది చొప్పున, జనరల్ సర్జరీలో 30 మంది, అనస్థీషియా విభాగంలో 26 మంది, పిల్లల వైద్యులు 25 మంది, ఆర్థోపెడిక్ నిపుణులు 18 మంది, రేడియాలజిస్టులు 17 మంది, కంటి మరియు ఈఎన్‌టి వైద్య నిపుణులు కూడా ఉన్నారు. 2022-23లో పీజీ పూర్తి చేసిన 257 మంది ఇన్‌సర్వీస్ వైద్యులలో, ఖాళీలు ఉన్న ఆసుపత్రుల్లో 227 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మిగిలిన 30 మందిని డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో ట్యూటర్లుగా నియమించినట్లు మంత్రి తెలిపారు.
ఈ నియామకాలతో పాటు ప్రభుత్వం త్వరలోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCs), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) లో కూడా మరో దశ నియామకాలను చేపట్టనుంది. 155 మంది వైద్యులను సీహెచ్‌సీలకు, మరో 155 మందిని పీహెచ్‌సీలకు నియమించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అందుబాటు మరింతగా పెరుగుతుందని మంత్రి సత్యకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కొత్త నియామకాలతో ప్రజలకు వైద్య సేవలు మరింత సులభతరం అవుతాయని, వైద్య రంగంలో నూతన శక్తి సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు.