అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన టారిఫ్ (దిగుమతి పన్నులు) విధానాన్ని బలంగా సమర్థించారు. “టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు అజ్ఞానులు” అని విమర్శకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన తన పాలనలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయ దేశంగా మారిందని తెలిపారు.
ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తూ... మా ప్రభుత్వం టారిఫ్‌ల ద్వారా ట్రిలియన్ల డాలర్లు సేకరిస్తోంది. ఆ ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి $2,000 డివిడెండ్ ఇవ్వబడుతుంది అని అన్నారు. ఈ చెల్లింపులు అధిక ఆదాయ వర్గాలకు వర్తించవని మధ్యతరగతి ప్రజలకే ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
అయితే ఈ చెల్లింపులు ఎప్పుడు ఎలా ఇవ్వబడతాయి అనే వివరాలు వెల్లడించలేదు. ఆయన ప్రకారం టారిఫ్ ద్వారా వచ్చిన ఆదాయం దేశ అప్పు తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ప్రజలకు నేరుగా లాభం చేకూరుస్తుంది.
ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా సుప్రీం కోర్టు ప్రస్తుతం టారిఫ్‌ల చట్టబద్ధతపై విచారణ జరుపుతున్న వేళ గమనార్హం. నవంబర్ 5న కోర్టు వాదనలు విన్న సందర్భంగా కొందరు న్యాయమూర్తులు ఈ పన్నుల చట్టబద్ధతపై అనుమానం వ్యక్తం చేశారు.
కోర్టు ఈ టారిఫ్‌లను రద్దు చేస్తే అమెరికా ప్రభుత్వానికి $100 బిలియన్లకు పైగా రీఫండ్ చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ట్రంప్ ఆర్థిక విధానానికి పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రంప్ ఇటీవల తన టారిఫ్‌లను "అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధం”గా పేర్కొన్నారు. వాటిని రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు “విపత్తు” వాటిల్లుతుందని హెచ్చరించారు.
ఈ కేసులో ప్రధానంగా ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించిన లిబరేషన్ డే టారిఫ్‌లు వివాదంలో ఉన్నాయి. ఆ టారిఫ్‌ల ప్రకారం వివిధ దేశాల నుండి అమెరికాకు వచ్చే వస్తువులపై 10% నుండి 50% వరకు పన్నులు విధించారు. ట్రంప్ ప్రకారం ఇది దేశీయ తయారీని బలోపేతం చేస్తుందని, విదేశీ వాణిజ్య లోటును తగ్గిస్తుందని చెప్పారు.
ఇదే సమయంలో, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ $2,000 డివిడెండ్ అంశంపై ట్రంప్‌తో తాను ఇంకా చర్చించలేదని తెలిపారు. అయితే ఆ డివిడెండ్ పన్ను సడలింపుల రూపంలో రావచ్చని సూచించారు.
బెసెంట్ ప్రకారం ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే టిప్స్, ఓవర్‌టైమ్, సోషల్ సెక్యూరిటీ పన్నులను తగ్గించే ప్రణాళికలో ఉంది. అలాగే ఆటో లోన్లపై డిడక్షన్ అవకాశాలను కల్పించడంపై కూడా చర్చ జరుగుతోంది.
ఇక అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వరకు ఈ టారిఫ్‌ల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ట్రంప్ తన విధానంపై వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు.