- ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు పోస్టు..
- North America: ట్రంప్ పోస్టును ఖండించిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక గ్రాఫిక్ ఫొటో అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. వెనెజువెలాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆయన చేసిన ఈ పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్రంగా స్పందిస్తూ ట్రంప్ తీరును ఖండించారు. ఈ గ్రాఫిక్ చిత్రంలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సమయంలో ఆయన ధరించిన నైట్ ట్రాక్ సూట్‌ను పోలిన దుస్తుల్లో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్నట్లు చూపడం చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక భేటీ కోసం ట్రంప్ చైనా పర్యటనకు వెళ్తున్న తరుణంలో ఈ పోస్టు ప్రత్యక్షం కావడం దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైట్ హౌస్ సైతం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ ఫొటోలను విడుదల చేయడంతో అమెరికా అధికారికంగానే ఈ వైఖరిని ప్రదర్శిస్తోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వెనెజువెలాను తమ దేశంలో కొత్త రాష్ట్రంగా పరిగణించాలని భావిస్తున్నట్లు ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించిన వ్యాఖ్యలకు ఈ సోషల్ మీడియా పోస్టు బలం చేకూరుస్తోంది.