ఏఐ రంగంలో విజయవంతంగా దూసుకెళ్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ తన అత్యాధునిక మోడల్ అయిన జీపీటీ-5ను తాజాగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. శుక్రవారం సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ దీనిని అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో ఏఐ వినియోగంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఓపెన్‌ఏఐకి అమెరికా తర్వాతి అతిపెద్ద మార్కెట్‌గా మారిందని, ఇక్కడ ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని తెలిపారు. ఈ వేగం చూస్తే త్వరలోనే భారతదేశం ఏఐ వినియోగంలో అమెరికాను కూడా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో సాధారణ ప్రజల నుంచి స్టార్టప్‌లు, పెద్ద కంపెనీల వరకు ఏఐని వినూత్నంగా వినియోగిస్తున్న తీరును ప్రశంసించారు. భారతీయులు ఏఐతో చేస్తున్న ప్రయోగాలు ఎంతో ఆసక్తికరంగా, ప్రేరణ కలిగించేలా ఉన్నాయని అన్నారు.
భారత్‌లో తమ ఉత్పత్తులను మరింత విస్తరించేందుకు, ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికై ఓపెన్‌ఏఐ కీలకమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం దేశీయ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.
అంతేకాకుండా, శామ్ ఆల్ట్‌మన్ వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో స్థానిక కంపెనీలతో సమావేశమై, భారత్‌లో ఓపెన్‌ఏఐ ఉత్పత్తుల విస్తరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.