విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేసే పనులు వేగవంతం అవుతున్నాయి. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో పౌర విమానయాన శాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు. ఈ కేఫ్‌లో ప్రయాణికులు తక్కువ ధరలకు అల్పాహారం, తాగునీరు, అవసరమైన ఇతర తినుబండారాలు పొందే వీలుంటుంది. అధిక రేట్లతో ఇబ్బందిపడుతున్న సామాన్యులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం ఆయన ఉడాన్ యాత్రి కేఫ్ మెనూ కార్డ్ ను ఆవిష్కరించారు.
ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త టెర్మినల్ భవనం నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో ఈ టెర్మినల్ ప్రజల వినియోగానికి సిద్ధమవుతుందని ప్రకటించారు. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ టెర్మినల్ ప్రారంభమైతే, విజయవాడ విమానాశ్రయం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అధిక ఛార్జీల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గడంతో మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, "ఉడాన్ యాత్రి కేఫ్ సాధారణ ప్రయాణికులకు నిజంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఇది ఒక మంచి సదుపాయం" అని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఆలస్యమవుతున్న టెర్మినల్ భవన నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతోందని వివరించారు. అలాగే త్వరలోనే విజయవాడ నుండి అహ్మదాబాద్, వారణాసి, కొచ్చిన్, పూణే నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఆయన ప్రకటించారు.