అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య వచ్చే వారం ఒక కీలక సమావేశం జరగనుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది.
ఈ సమావేశంలో ముందుగా ట్రంప్, పుతిన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడనున్నారని సమాచారం. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి రష్యాతో సీజ్ ఫైర్ (యుద్ధ విరమణ)పై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు చూపాలన్నదే ట్రంప్ (Trump) లక్ష్యంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ విషయంపై వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. "రష్యన్లు ట్రంప్‌ను కలవాలనుకుంటున్నారు. ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ నేతలతో మాట్లాడాలని భావిస్తున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీ రాజకీయంగా, అంతర్జాతీయంగా కీలకంగా మారనుంది.
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు కనపడుతోందా? ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ భేటీతో ఏవిధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తికర అంశంగా మారుతోంది. ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.