మాజీ మంత్రి వైవీ శ్రీ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తన భర్తతో కలిసి కడప జిల్లా ఎస్పీ అశోకుమార్ ను కలిసి వివేకా హత్య కేసు తాజా పరిణామాలపై చర్చించారు. సుప్రీంకోర్టులో నిందితుల బెయిలు రద్దుకు సంబంధించిన పిటిషన్ నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీత, గతంలో జరిగిన వివేకా హత్యను గుర్తు చేస్తూ, తాజాగా పులివెందులలో జరిగిన సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. "జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు రోజులుగా అక్కడ నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే, మా నాన్న హత్య సమయంలో ఉన్న వాతావరణమే గుర్తుకొస్తోంది" అంటూ ఆమె పేర్కొన్నారు.
అప్పట్లో వివేకా హత్యను గుండెపోటుగా మార్చి చూపించేందుకు ప్రయత్నించిన విషయం గుర్తు చేస్తూ, "తెదేపా నాయకులే హత్యకు పాల్పడ్డారని ప్రచారం చేసి, నమ్మబలికే ప్రయత్నం చేశారు. క్రైం సీన్ ని ముసిపెట్టారు. మా నాన్న చేతి సంతకుతో వచ్చినట్లు ఓ లేఖ చూపిస్తూ, ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని అంగీకరించాలని నన్ను ఒత్తిడి చేశారు" అని చెప్పారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించడం, ఈ కేసు విచారణను ప్రభావితం చేయడం జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో జడ్పీటీసీ ఎన్నికల్లో మా బంధువు సురేష్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నామంటూ ఆమె తెలిపారు.
"ఆరేళ్లుగా ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నా, ఇంకా నిందితులకు శిక్ష పడలేదు. పైగా మమ్మల్నే హత్యలో ప్రధాన నిందితుల్లా చిత్రీకరిస్తున్నారు. నిజంగా ఎవరు తప్పు చేశారో వారికి శిక్ష పడాల్సిందే" అని ఆమె తేల్చి చెప్పారు.