టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం పలువురు నిర్మాతలు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను కలిశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ వద్ద జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలో జరుగుతున్న తాజా పరిణామాలను ఆయనకు వివరించారు.
సమావేశం అనంతరం నిర్మాత ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ – “బాలకృష్ణ గారు ఎప్పుడూ నిర్మాతల ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ఈసారి కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. పని దినాలను తగ్గిస్తే నిర్మాతలకు భారం తగ్గుతుందని, అవసరమైన స్థాయిలోనే కార్మికులను నియమించుకోవాలని సూచించారు.
అలాగే నిర్మాతలూ, కార్మికులూ ఇరువర్గాలు సంతృప్తిగా ఉండేలా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. థియేటర్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది నాలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమని తెలిపారు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు” అని వివరించారు.
ఇక, ఇదే విషయంపై మంగళవారం పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి చర్చించి పరిష్కారం సాధించాలని ఆయన సూచించారని, అయినా సమస్యలు తీరకపోతే తాను స్వయంగా జోక్యం చేసుకుంటానని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు.