ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు ప్రజలకు మిగిల్చిన భయాందోళన అంతాఇంతా కాదు. నిత్యం కొత్తకొత్త ఫ్రాడ్ ట్రిక్స్‌తో సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలను దోచుకుంటూ ప్రజల జీవనాన్ని దారుణంగా ప్రభావితం చేస్తున్నారు. ఫేక్ లింకులు, డిజిటల్ అరెస్టులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి మార్గాల్లో అమాయకులను వలలో వేసే వీరి కుట్రలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇదంతా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
మూడేలు లక్షలపైగా సిమ్ కార్డులకు తాళం సైబర్ మోసాలను అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 3 నుండి 4 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ నెంబర్లను ఆన్‌లైన్ మోసాల కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్తగా సిమ్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో సైతం కఠిన నియమాలు అమలులోకి తెచ్చారు. అలాగే మోసగాళ్ల కదలికలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
రోజుకి 2,000 ఫ్రాడ్ నెంబర్లు గుర్తింపు. మే 2025లో విడుదలైన ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ నివేదిక ప్రకారం.. ప్రతి రోజూ సుమారు 2,000 ఫ్రాడ్ సంబంధిత సిమ్ కార్డులు గుర్తించబడుతున్నాయి. వీటిని గుర్తించేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. యూపీఐ లావాదేవీలు సులభతరం చేసినా.. అదే మార్గాన్ని మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో దేశంలోని అన్ని బ్యాంకులకు ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ వ్యవస్థలను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.