2016లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చలామణి నుండి తొలగించింది. అనంతరం కొత్త రూపంలో రూ.500 నోటును పరిచయం చేసింది. రూ.2000 నోటును కూడా ప్రవేశపెట్టిన RBI, 2023 మేలో దీన్ని ఉపసంహరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న అత్యంత విలువైన నోటుగా రూ.500 నోటే చలామణిలో ఉంది.
అయితే, ఈ రూ.500 నోటును కూడా వెనక్కు తీసుకుంటారా అన్న అనుమానాలు కొన్ని వర్గాల్లో నెలకొన్నాయి. ఇందుకు కారణం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన కొన్ని కీలక మార్గదర్శకాలు. దేశవ్యాప్తంగా ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్ల లభ్యతను గణనీయంగా పెంచాలని RBI ఆదేశించింది. అన్ని బ్యాంకులతో పాటు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు కూడా ఇదే సూచన ఇచ్చింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 30లోగా దేశంలోని మొత్తం ఏటీఎంలలో కనీసం 75 శాతం ఏటీఎంలలో ఒక్క క్యాసెట్ అయినా రూ.100 లేదా రూ.200 నోట్లతో నింపాలి. 2026 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 90 శాతానికి చేరాలని పేర్కొంది. దీంతో ప్రజల్లో రూ.500 నోటు రద్దు చేస్తారేమోనన్న సందేహాలు పెరిగిపోయాయి.
అయితే, ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్ల సరఫరా ఆపే ఎలాంటి యోచన తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లతో పాటు రూ.500 నోట్ల పంపిణీ కూడా యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
ఇటీవలే రూ.2000 నోట్ల ఉపసంహరణపై కూడా RBI కీలక ప్రకటన చేసింది. ఆ సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లను చలామణి నుంచి తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ ప్రజల వద్ద దాదాపు రూ.6,017 కోట్ల విలువైన రూ.2000 నోట్లే మిగిలి ఉన్నట్లు RBI వెల్లడించింది. ఇవి ఇప్పటికీ RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని, అవసరమైతే స్పీడ్ పోస్టు ద్వారా పంపించవచ్చని తెలిపింది.