మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలనను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో, మంత్రుల పనితీరును సమీక్షిస్తూ కొన్ని మార్గనిర్దేశాలు చేశారు.
మంత్రులు గత ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారని అభిప్రాయపడ్డ ఆయన – ఇకపై పరిపాలనలో మరింత దూకుడుతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిత్యం ఉండాలని, వారి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తప్పుడు వార్తల ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే దిశగా వైసీపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించిన సీఎం, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు వ్యవస్థ సహా, రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వైసీపీ ముళ్లను తొలగించాలంటే ప్రజల మద్దతు కోల్పోయేలా కాకుండా నిఖార్సైన పాలన చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంచే క్రమంలో ప్రత్యేకమైన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సింగపూర్ విధానాల అధ్యయనం కోసం మంత్రులు దశల వారీగా ఆ దేశానికి వెళ్లాలని, అక్కడి పాలనాపద్ధతులపై అవగాహన పొందాలని సూచించారు. దీని వల్ల రాష్ట్రానికి ప్రపంచ స్థాయి అభివృద్ధి నమూనాలు తీసుకురావచ్చన్నారు.
ప్రజల్లో ప్రభుత్వం మీద ఇప్పటికే మంచి విశ్వాసం ఏర్పడిందని, దాన్ని మంత్రుల పనితీరుతో మరింత బలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి అవసరాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
జనసేన, బీజేపీ నేతలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, పాలనలో లొపాలను చర్చించి వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సూచించారు.
ప్రతి శాఖ మంత్రి తమ శాఖ పనితీరును సమీక్షిస్తూ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ప్రతి మంత్రి తమ శాఖలో సాధించిన ఘనతలు, ఉన్న లోపాలు, భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.