దేశంలో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన టాటా ఏఐజీ, తాజాగా పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ హాస్పిటల్స్ చైన్‌లో క్యాష్‌లెస్ హెల్త్ సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే స్టార్ హెల్త్, నివా బూపా, కేర్ హెల్త్ వంటి సంస్థలు ఈ సదుపాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు టాటా ఏఐజీ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ఈ నిర్ణయానికి టారిఫ్ రేట్ల వివాదమే కారణం అని సమాచారం. దీంతో మ్యాక్స్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న రోగులు, ఇన్సూరెన్స్ పాలసీదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నిర్ణయంపై మ్యాక్స్ హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా స్పందించింది. తమకు టాటా ఏఐజీతో 2025 జనవరి 16 నుంచి 2027 జనవరి 15 వరకు రెండు సంవత్సరాల పాటు టారిఫ్ ఒప్పందం ఉందని వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూలైలో టాటా ఏఐజీ అనూహ్యంగా సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత ఒప్పందానికి విరుద్ధంగా రేట్లు తగ్గించాలని డిమాండ్ చేసిందని ఆరోపించింది. తాము అందుకు అంగీకరించకపోవడంతో, సెప్టెంబర్ 10 నుంచి ఏకపక్షంగా క్యాష్‌లెస్ సేవలు నిలిపివేశారని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో టాటా ఏఐజీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపింది. పాలసీదారుల కోసం అన్ని క్లెయిమ్‌లను ప్రాధాన్యతతో, వేగంగా పరిష్కరిస్తున్నామని హామీ ఇచ్చింది. అంతేకాక, రోగులు చికిత్సలో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని స్పష్టంచేసింది. అయితే, క్యాష్‌లెస్ సర్వీస్ నిలిపివేయడం వల్ల పాలసీదారులు ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అనుసరించక తప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే, స్టార్ హెల్త్, నివా బూపా సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న 22 మ్యాక్స్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సేవలు నిలిపివేశాయి, అయితే కేర్ హెల్త్ మాత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని హాస్పిటల్స్‌కే పరిమితం చేసింది. ఈ పరిణామంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (AHPI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే క్యాష్‌లెస్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. లేదంటే రోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతారని హెచ్చరించింది. ఇలాంటి చర్యల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఉద్దేశం దెబ్బతింటుందని, పాలసీదారులు నష్టపోతారని స్పష్టంచేసింది.