భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశ వ్యాప్తంగా వినియోగదారుల కోసం ఒక కొత్త దశను ప్రారంభించబోతోంది. రేపటినుంచే బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను సెప్టెంబర్ 27న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒడిశాలోని జార్సుగూడా నుండి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారు. ఇదే సమయానికి గౌహతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు. దేశీయ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు, దేశానికి స్వావలంబన దిశగా మరో ముందడుగుగా భావించబడుతోంది.
ఈ 4జీ సేవలు పూర్తిగా క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ పై అమలు చేయబడ్డాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సులువుగా 5జీకి అప్‌గ్రేడ్ చేసే సౌలభ్యం కలదు. దేశీయ టెలికాం రంగానికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీలు 4జీ, 5జీ సర్వీసుల్లో ముందంజలో ఉంటే, బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త టెక్నాలజీతో పోటీకి సిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు విస్తృతంగా చేరుకోవడంతో కోట్లాది వినియోగదారులకు మరింత చౌకగా, నాణ్యమైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం, ఈ 4జీ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా దాదాపు 98 వేల సైట్లలో ఒకేసారి అందుబాటులోకి రాబోతోంది. అంటే ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రాలంతటా ఒకే సమయంలో ప్రారంభించబడుతుంది. ఇప్పటివరకు ప్రైవేట్ ఆపరేటర్ల ఆధిపత్యం ఉన్న 4జీ రంగంలో, బీఎస్ఎన్ఎల్ ప్రవేశం వల్ల ప్రతిస్పర్థాత్మక ధరలు సాధ్యమవుతాయి. దీంతో వినియోగదారులకు లాభం కలగడం ఖాయం. స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన ఈ సర్వీస్, భద్రత పరంగా కూడా ఒక పెద్ద పాజిటివ్‌గా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ కొత్త 4జీ సర్వీసులు కేవలం వేగం పెంపుకే పరిమితం కాకుండా, డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఈ-గవర్నెన్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసులు వంటి డిజిటల్ సౌకర్యాలు మరింత వేగంగా విస్తరించేందుకు ఇది తోడ్పడనుంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ ప్రాజెక్టు ద్వారా, భారత్ సాంకేతిక రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక బలమైన అడుగు వేసిందని చెప్పవచ్చు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ సేవలు, కోట్లాది భారతీయుల కమ్యూనికేషన్ ప్రపంచంలో కొత్త దిశగా నిలవడం ఖాయం.