తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రముగా పేరొందింది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు, చెరువులు, శిల్పకళా సంపద ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. వాటిలో రామప్ప దేవాలయం అత్యంత విశేషమైనది. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న ఈ ఆలయం రేచర్ల రుద్రుడు 1173లో నిర్మాణం ప్రారంభించి 1213లో పూర్తిచేశాడు. నలభై ఏళ్లపాటు నిర్మించిన ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందింది.
రామప్ప ఆలయాన్ని మొదట రుద్రేశ్వరాలయం అని పిలిచేవారు. ఆలయంలో శివలింగాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు ప్రతిష్టించాడు. తరువాత కాలక్రమంలో ఆలయ నిర్మాణ శిల్పి రామప్ప పేరుతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ. ఆలయంలోని శివుడిని రామలింగేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. ఈ కట్టడంలో ప్రతి శిల్పం కాకతీయుల ప్రతిభను తెలియజేస్తుంది.
ఈ ఆలయంలోని శిల్ప కళలు పేరిణి శివతాండవ నృత్యానికి ప్రేరణగా నిలిచాయి. ఆలయం గోడలపై, గోపురాలపై చెక్కిన ప్రతిమలు అపూర్వమైన శిల్పకళా నైపుణ్యానికి ఉదాహరణలు. 1983లో నటరాజ రామకృష్ణ ఈ శిల్పాల ఆధారంగా పేరిణి నృత్యకళను పునరావిష్కరించారు. అలాగే ఆలయంలోని కొన్ని శిల్పాలు తాకితే సప్త స్వరాలు వినిపిస్తాయి. ఇది కాకతీయుల శిల్పకళలోని విశేషతను తెలియజేస్తుంది.
రామప్ప ఆలయ నిర్మాణంలో వాడిన తేలియాడే ఇటుకలు, రంగు కోల్పోని రాళ్లు, సాండ్ టెక్నాలజీ ఆధారంగా చేసిన నిర్మాణం యునెస్కో గుర్తింపు పొందడానికి కారణమయ్యాయి. 800 ఏళ్లకు పైగా కాలం గడిచినా ఆలయం చెక్కుచెదరకుండా నిలిచి ఉండటం కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఈ విశేషతలే ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా చేశాయి.
ఆలయం మాత్రమే కాకుండా పక్కనే ఉన్న రామప్ప చెరువు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. కాకతీయుల కాలంలో తవ్వించిన ఈ చెరువు ఇప్పటికీ తాగునీరు, సాగునీరు అందిస్తోంది. చెరువు వద్ద కాటేజీలు కూడా నిర్మించబడటంతో పర్యాటకులకు అనుకూలమైన వసతులు ఉన్నాయి. హైదరాబాదు నుండి 220 కిలోమీటర్లు, వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప ఆలయం, తెలంగాణలో తప్పక సందర్శించాల్సిన చారిత్రక ప్రదేశంగా నిలుస్తోంది.