ఏపీ రాజధాని అమరావతిని నిర్మించేందుకు 2014–19 కాలంలో సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్‌ప్లాన్ సహా అనేక ఒప్పందాలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ ఒప్పందాలు రద్దు చేయడంతో పాటు సింగపూర్ కంపెనీలపై విచారణకు సీఐడీ అధికారుల్ని పంపడంతో ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, లోకేశ్‌లతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తయిన తరువాత ప్రభుత్వ విధానాలపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, సింగపూర్ తో లాబీయింగ్ ఫలించలేదని పలువురు భావించారు.
అయితే, ముఖ్యమంత్రి తిరిగివచ్చిన తర్వాత కూడా సింగపూర్‌లోనే కొనసాగి, అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. గతంలో సింగపూర్‌తో ఉన్న ఒప్పందాలను పునరుద్ధరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, ఈ విషయంలో అక్కడి అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు మీద విశ్వాసం, గౌరవం ఉందని పేర్కొన్న నారాయణ, ప్రపంచ బ్యాంకుతో కలసి అమరావతికి మళ్లీ సింగపూర్ సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
అలాగే విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు సింగపూర్ కంపెనీలను ఆహ్వానించినట్లు చెప్పారు. దీనికి కొనసాగింపుగా, సీఆర్డీఏ కమిషనర్ అధికారికంగా లేఖ రాసిన తరువాత మరిన్ని చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం though సింగపూర్ కన్సార్టియం అమరావతి నిర్మాణం లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా, సాంకేతిక మద్దతు మాత్రం అందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించగా, ఇప్పుడు మంత్రి నారాయణ కూడా అదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.