ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు. "రైతు భరోసా పేరుతో జగన్ రైతులను మోసం చేశాడు. రైతుల కష్టాలు అర్థం చేసుకోకుండా వంచనకు పాల్పడ్డాడు," అని మండిపడ్డారు. ఇకపై కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి న్యాయం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి రైతుల ఖాతాల్లో రూ.20 వేల రూపాయలు నేరుగా జమ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కోఆర్డినేటర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై సూచనలు చేశారు.
ఈనెలలో అమలు కానున్న అన్నదాత సుఖీభవ పథకం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరోసారి నేతలకు వివరించారు. ఈ రెండు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజల మనసులను గెలుచుకోవాలని సీఎం సూచించారు. "ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఈ పథకాల లబ్ధి చేరేటట్లు కృషి చేయాలి. పార్టీ కార్యకర్తలు ముందుండి ప్రచారం చేయాలి," అని ఆయన ఆదేశించారు.
"గతంలో మనం చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లో బలంగా చాటలేక నష్టపోయాం. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు," అని సీఎం తెలిపారు. ప్రతి పథకం అమలు అవుతున్న విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
చంద్రబాబు త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. "నా కోసం కాదు, మీ కోసం ఈ పదవులు. కష్టపడి పని చేసిన వారికి గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వడం నా కర్తవ్యమని భావిస్తున్నాను," అని సీఎం హామీ ఇచ్చారు.
"నాకు ముఖ్యమైనది ప్రజలు, కార్యకర్తలు. మీ శ్రమకు గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటాను," అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రతి నేత, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తేనే కూటమి ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. "ప్రతీ కార్యక్రమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం," అని ఆయన పిలుపునిచ్చారు.