అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. "ఇండియా, రష్యా వంటి దేశాలు డెడ్ ఎకానమీస్" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై, రష్యా తీవ్రంగా స్పందించింది. రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ, ట్రంప్‌కు కఠినంగా వార్నింగ్ ఇచ్చారు.
మెద్వెదేవ్, రష్యాలో ఉన్న అతి ప్రమాదకరమైన "(Dead Hand)" సిస్టంపై ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించారు. ఇది రష్యా వద్ద ఉన్న ఆటోమేటెడ్ న్యూక్లియర్ ప్రతీకార వ్యవస్థగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో, రష్యా ఎక్కడైనా విరుచుకుపడే ప్రమాదం ఉందన్న భయంతో, ట్రంప్ తక్షణమే జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్యా (Russia) హెచ్చరికల నేపథ్యంలో, ట్రంప్ అమెరికన్ ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు, అమెరికా కు సమీపంగా రెండు అణు సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్లను మోహరించారు. దీని గురించి ట్రంప్ స్వయంగా తన స్వంత సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు.
ఈ చర్యలను ట్రంప్ ముందుజాగ్రత్త చర్యలుగా పేర్కొన్నారు. అంతేకాదు, అమెరికా భద్రతకు ఏమైనా ముప్పు పొంచి ఉందన్న సందేశాన్ని పరోక్షంగా అందించారు. దీంతో అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా-రష్యా సంబంధాలు ఇప్పటికే గందరగోళంగా ఉన్న ఈ పరిస్థితుల్లో, ఇలాంటి హెచ్చరికలు, ఆయుధ కదలికలు మరింత ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.