ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 'బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో కేవలం రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత సేవలను అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
రూ.1 ప్లాన్‌లో లభించే సేవలు… ఈ ప్రత్యేక ప్లాన్ కింద రూ.1 రీఛార్జ్ చేసుకుంటే కొత్త కస్టమర్లు ఈ కింద పేర్కొన్న ప్రయోజనాలు పొందవచ్చు:
30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్. ప్రతిరోజూ 100 ఎస్సెమ్మెస్లు. రోజుకు 2జీబీ డేటా. ఈ ప్లాన్‌తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉచితంగా ఇస్తారు.
ఆఫర్ ఎప్పటి వరకు..? ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే కొత్త కస్టమర్లు తమ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా ఏదైనా బీఎస్‌ఎన్‌ఎల్ రిటైలర్ దుకాణాన్ని సందర్శించవచ్చు. కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు, దేశవ్యాప్తంగా తన 4జీ సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.