ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఫీజులు, ఇతర ఖర్చులు కారణంగా అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా ప్రభావితమవుతున్న వారు అమ్మాయిలే. పాఠశాల స్థాయి వరకు చదివినా, ఆ తర్వాతి చదువుకు అవసరమైన ఆర్థిక వనరులు లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించి, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంగా అమలు చేయనున్నారు. దీని కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు గ్యాడ్యుయేట్, వృత్తివిద్య, డిప్లొమా కోర్సులు చదివేంత వరకూ ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థినికి రూ.30,000 చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఈ పథకం 2025–26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానుంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 37,000 మందికి పైగా విద్యార్థినులు దీని ద్వారా లబ్ధి పొందుతారని అంచనా. దరఖాస్తుదారుల సంఖ్య పెరిగితే, స్కాలర్‌షిప్‌ల సంఖ్యను కూడా పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీపిక స్కాలర్‌షిప్ పథకానికి అర్హత పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ పథకం కేవలం అమ్మాయిలకే వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు 10వ తరగతి, ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC)లను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసి ఉండాలి. అలాగే, డిగ్రీ, వృత్తివిద్య లేదా డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థినులకే ఈ ఆర్థిక సహాయం అందుతుంది. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన సర్టిఫికెట్లు, ప్రవేశ వివరాలు వంటి పత్రాలు సమర్పించాలి. విద్యాశాఖ పోర్టల్‌లో సూచించిన అదనపు పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కర్ణాటకలో విద్యార్థుల డ్రాప్‌అవుట్ రేటు ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో సెకండరీ స్కూల్ స్థాయిలో డ్రాప్‌అవుట్ రేటు 22.2%గా నమోదైంది. ఇది జాతీయ సగటు 14.1% కంటే గణనీయంగా ఎక్కువ. ఈ పరిస్థితిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా చదువును మధ్యలో మానేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, అమ్మాయిలను ఉన్నత విద్యలోకి నడిపించడానికి ‘దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్’ పథకం గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పేద విద్యార్థినుల విద్యా హక్కులను కాపాడి, వారి భవిష్యత్తును వెలుగులోకి తేవడమే దీని ప్రధాన లక్ష్యం.