మనలో చాలామందికి కుక్కలంటే ఇష్టం. వాటితో ఆడుకోవడం ఆనందంగా ఉంటుంది. కానీ ఆడుకునే సమయంలో కుక్కల గోర్లు మనిషి శరీరానికి తగలడం సహజం. కొన్నిసార్లు గోరు గుచ్చుకోవడం, గీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో చాలా మందికి ఒకే సందేహం వస్తుంది కుక్క గోరు గుచ్చుకుంటే రేబిస్ వస్తుందా?
ఇటీవల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక యువకుడు కుక్క గోరు గుచ్చుకుని నిర్లక్ష్యం చేశాడు. చికిత్స తీసుకోకుండా వదిలేయడంతో అతనికి రేబిస్ సోకి ప్రాణం కోల్పోయాడు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. చిన్న విషయం అనుకుని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం చాలా పెద్దదవుతుంది.
కాబట్టి రేబిస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది రేబిస్ వైరస్ వల్ల వస్తుంది. సాధారణంగా రేబిస్ సోకిన కుక్క లేదా పిల్లి లాంటి జంతువులు కరిస్తే ఈ వ్యాధి వస్తుంది. ఎందుకంటే కరిచినప్పుడు వాటి లాలాజలం (saliva) మన గాయంతో కలిసిపోతుంది. అక్కడినుంచి వైరస్ శరీరమంతా వ్యాపిస్తుంది.
గోర్లు గుచ్చుకున్నప్పుడు ప్రమాదమా?
వైద్యులు చెబుతున్నది ఏమిటంటే కుక్క గోరు గుచ్చుకోవడం వల్ల రేబిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఒకవేళ గోరు లోతుగా గుచ్చుకుని రక్తం వచ్చి, ఆ గాయానికి కుక్క లాలాజలం తగిలితే మాత్రం ప్రమాదం పెరుగుతుంది. అంటే, కేవలం గోరు తగిలితే పెద్ద సమస్య ఉండదు. కానీ గాయమైతే నిర్లక్ష్యం చేయకూడదు.
గోరు గుచ్చుకున్నప్పుడు ఏమి చేయాలి?
1. గాయం అయిన ప్రదేశాన్ని వెంటనే సబ్బు, నీటితో కనీసం 10 నిమిషాలు బాగా కడగాలి.
2. గాయం లోతుగా ఉంటే లేదా రక్తస్రావం అయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
3. వైద్యుడు చెప్పినట్లుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ARV)లేదా టెటనస్ టీకా (TT) తీసుకోవాలి.
4. టీకాల కోర్స్ మొదలుపెడితే, మధ్యలో ఆపకుండా పూర్తిగా చేయాలి.
మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుక్క ని పెంచుతున్నప్పుడు వాటికి తప్పకుండా టీకా వేయించుకోండి. మీరు ఏదో పనిలో ఉండి కుక్క దగ్గరికి పిల్లలు వెళ్లి సరదాగా ఆడుతున్నప్పుడు గీసుకున్న పిల్లలకు ప్రాణాంతకమైన వైరస్ బారిన పడినట్లే సుమీ.ఈ సమాచారం అనేది కేవలం మీ అవగాహనకు మాత్రమే.