అమెరికా మార్కెట్‌కి భారత్ ఔషధాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. ఇప్పటికీ అమెరికా, భారత ఔషధాలపై 50 శాతం సుంకం వేస్తోంది. తాజాగా ట్రంప్ మరో పెద్ద ప్రకటన చేశారు. 2025 అక్టోబర్ 1 నుంచి అమెరికాలో అమ్ముడవుతున్న అన్ని బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై 100 శాతం సుంకం వేయబోతున్నట్టు తెలిపారు. అయితే అమెరికాలోనే తయారయ్యే మందులకు మాత్రం ఈ పన్ను వర్తించదని స్పష్టం చేశారు. అలాగే వంటింటి వస్తువులు, బాత్‌రూమ్‌లో ఉపయోగించే వస్తువులు, కొన్ని రకాల ఫర్నీచర్ మీద కూడా అదనపు సుంకాలు విధిస్తున్నామని ప్రకటించారు. వీటన్నిటిని దేశీయ తయారీని రక్షించడానికి తీసుకున్న నిర్ణయమని ఆయన రాశారు.
భారత్ ఫార్మా రంగం ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఎగుమతి కేంద్రంగా నిలుస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు ఏటా సుమారు 12.7 బిలియన్ డాలర్ల (రూ.1,12,000 కోట్లకు పైగా) విలువైన ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా జనరిక్ మందులే. బ్రాండెడ్ మందులు కూడా వెళ్తున్నా వాటి వాణిజ్యం తక్కువే. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్ వంటి భారతీయ కంపెనీలు బ్రాండెడ్ ఔషధాలను అమెరికాకు పంపుతున్నాయి. ట్రంప్ కొత్త సుంకాల వల్ల జనరిక్, బ్రాండెడ్ ఔషధాల ధరలు అమెరికాలో పెరుగుతాయని జీటీఆర్ఐ స్పష్టం చేసింది.
భారతీయ కంపెనీలు అమెరికాలో చాలా తక్కువ లాభ మార్జిన్లతో పనిచేస్తున్నాయి. అయినా కూడా ఉత్తర అమెరికా మార్కెట్‌నే తమ ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకున్నాయి. వీటి లాభాల్లో మూడో వంతు వరకు అమెరికా నుంచే వస్తోంది. జనరిక్ మందులు చౌకైనవి కాబట్టి అమెరికాలో ప్రిస్క్రిప్షన్లలో 90 శాతం వరకు ఇవే వాడుతున్నారు. ఒక అంచనా ప్రకారం 2022లో భారత జనరిక్ మందుల వల్ల అమెరికా ప్రజలు 219 బిలియన్ డాలర్ల ఆరోగ్య ఖర్చును ఆదా చేసుకున్నారు. అంటే భారత్ నుంచి వచ్చే మందులు అమెరికా ఆరోగ్య వ్యవస్థకు బలంగా తోడ్పడుతున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం ట్రంప్ సుంకాల వల్ల భారతీయ కంపెనీలకు పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల కొన్ని కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సిందే. అలా అయితే అమెరికా రోగులకు మందుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. మరోవైపు, భారత్ వంటి దేశాల నుంచి జనరిక్ మందులు తగ్గిపోతే అమెరికా ఆరోగ్య వ్యవస్థకు భారీగా భారమవుతుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ముందుకు వెళ్తే అమెరికా, భారత్ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.