తిరుపతి (Tirupati) (రేణిగుంట) విమానాశ్రయం నుంచి హైదరాబాద్ (Hyderabad) కు బయలుదేరిన ఇండిగో విమానం (Indigo flight) తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలట్ అప్రమత్తంగా స్పందించి, విమానాన్ని దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి తిరిగి తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకొచ్చాడు.
అయితే, ల్యాండింగ్‌కు క్లియరెన్స్ ఆలస్యం కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా విమాన సేవను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.
అలాగే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిరాశను వ్యక్తం చేస్తూ తమ ప్రయాణం కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇండిగో మాత్రం టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. అయితే విమానం రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.