ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) కోనసీమ వాసుల రైలు కల సాకారమవుతోంది. సుమారు 24 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోటిపల్లి (Kotipalli) - నర్సాపురం రైల్వే లైన్ (Narsapuram Railway Line) నిర్మాణానికి వేగం వచ్చింది. కోర్టు స్టేలు తొలగిపోవడంతో రెండో విడత భూసేకరణకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. లక్ష్యం – వచ్చే ఐదు నెలల్లో భూసేకరణ పూర్తిచేసి నిర్మాణం ప్రారంభించడం.
ఈ రైల్వే లైన్ (Railway Line) మొత్తం 57.81 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి నుంచి పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా నర్సాపురం వరకు ఇది విస్తరించనుంది. మొత్తం 8 మండలాల్లో 25 గ్రామాలపైగా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. దీనికి సుమారు 846 ఎకరాల భూమి అవసరం.
ఇప్పటికే 279 ఎకరాల భూమిని రైల్వే శాఖ స్వాధీనం చేసుకుంది. రెండో విడతలో 18 గ్రామాల్లో 590 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 13 గ్రామాల్లో 402 ఎకరాలను గుర్తించారు. మిగిలిన భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ (Notification issued) చేసి, ఐదు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పేరూరు, పాశర్లపూడి, గుడిమెల్లంకలో బ్రిడ్జ్ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. అధికారుల అంచనాల ప్రకారం అన్ని పనులు అనుకున్నట్టే జరిగితే మూడేళ్లలో కోనసీమలో రైలు పరిగెత్తే రోజు దూరం కాదు.