ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంపై పాశ్చాత్య దేశాల మీడియా తప్పుడు ఊహాగానాలతో కూడిన కథనాలను ప్రచురిస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Minister Kinjarapu Rammohan Naidu) తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
జూన్ 12న అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఈ విషాద ఘటనలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) చేస్తున్న పరిశోధనలో బ్లాక్ బాక్స్ డేటాను దేశంలోనే విజయవంతంగా డీకోడ్ చేయడం గొప్ప పురోగతి అని మంత్రి కొనియాడారు.
గతంలో అలాంటి సందర్భాల్లో బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపేవారని, ఇప్పుడు భారత్‌లోనే డేటాను విశ్లేషించడం గర్వకారణమన్నారు. ప్రాథమిక నివేదిక సిద్ధంగా ఉన్నా, తుది నివేదిక వచ్చేదాకా ఎవరూ ఊహాగానాలకు లోనుకావద్దని స్పష్టం చేశారు.
వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి పశ్చిమ మీడియా సంస్థలు ఆధారాలు లేకుండానే పైలట్లపై నిందలు వేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. విదేశీ మీడియా సంస్థలు స్వప్రయోజనాల కోసం అసత్య కధనాలు ప్రచురించవద్దని AAIB హెచ్చరించిందని తెలిపారు.
అమెరికా (America) జాతీయ రవాణా భద్రతా మండలి చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెండీ కూడా ఈ కథనాలను సమర్థించకుండా, అవి నిరాధారమైనవని పేర్కొన్నారు. AAIB జూలై 17న విడుదల చేసిన ప్రకటనలో, తప్పుడు వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది.
తుది నివేదిక కోసం అన్ని వర్గాలు ఓపికగా ఎదురుచూడాలని, అప్పటివరకు ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.