భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ (Vijayawada) లోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగుల పూర్తి స్థాయిని చేరడంతో, గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్‌ఫ్లో - అవుట్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదలలో మార్పులు వస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. బ్యారేజీ ద్వారా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్న నేపథ్యంలో, కృష్ణా నదికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నదిలో ప్రయాణాలు చేయరాదు, అలాగే వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విపత్తు సంస్థ విజ్ఞప్తి చేసింది.