ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ పండుగల సందర్భంగా శుభవార్త అందించింది. దీపావళి, ఛత్ పండుగల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు విశాఖ నుంచి దానాపూర్, భువనేశ్వర్ మార్గాల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పండుగల సమయంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగనుంది.
విశాఖపట్నం నుండి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు నవంబర్ 4న ఉదయం 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 5న మధ్యాహ్నం 12:30కు దానాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:42కు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైల్లో 3 థర్డ్ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్ సీటింగ్, 2 దివ్యాంగజన్ బోగీలు అందుబాటులో ఉంటాయి.
ఇక విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు ప్రత్యేక అన్‌రిజర్వుడ్ రైలు నవంబర్ 15 వరకు ప్రతి రోజు నడపనున్నారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి 7:45కు భువనేశ్వర్ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10:30కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:45కు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైల్లో దివ్యాంగజన్, మోటార్ కార్ బోగీతో పాటు 10 జనరల్ క్లాస్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి.
దేశవ్యాప్తంగా పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారత రైల్వే మొత్తం 7,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే ప్రయాణికుల భద్రత కోసం జనరల్ బోగీల్లో ఎక్కే వారిని క్యూలైన్ విధానంలోకి తీసుకురానున్నారు. ఇది ప్రయాణంలో క్రమశిక్షణ, సౌలభ్యాన్ని పెంచనుంది.
దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. కాచిగూడ, నాందేడ్, చెన్నై, అంబాలా, ఛాప్రా మార్గాల్లో దీపావళి స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన స్టేషన్లలో 14 అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందిని కూడా నియమించారు. ఈ నిర్ణయాలతో పండుగలలో ప్రయాణికుల భారం తగ్గి, సులభతరమైన రవాణా అందుబాటులోకి రానుంది.