మీరు ఇంకా విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్‌తో (OS) పనిచేసే కంప్యూటర్‌ను వాడుతున్నారా? అయితే ఇది మీకోసం ఒక అత్యంత ముఖ్యమైన వార్త! సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఒక కీలక ప్రకటన చేసింది: రాబోయే అక్టోబర్ 14 నుంచి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు తమ సపోర్ట్‌ను పూర్తిగా నిలిపివేస్తోంది.
దీని అర్థం ఏమిటంటే.. అక్టోబర్ 14 తర్వాత మీకు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్, కొత్త ఫీచర్లను మెరుగుపరిచే అప్‌డేట్స్ గానీ, లేదా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు టెక్నికల్ సపోర్ట్ గానీ అందుబాటులో ఉండవు. ఈ వార్త విండోస్ 10 వాడుతున్న కోట్ల మంది సాధారణ యూజర్లతో పాటు, చిన్న, పెద్ద వ్యాపార సంస్థలను కూడా ప్రభావితం చేయనుంది.
విండోస్ 10 సపోర్ట్ నిలిచిపోవడం అంటే, మీ కంప్యూటర్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కాదు. మైక్రోసాఫ్ట్ ప్రకటన ప్రకారం, అక్టోబర్ 14 తరువాత కూడా మీరు మీ పీసీలను యథాతథంగా వినియోగించుకోవచ్చు. కానీ, ఇక్కడే పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
సైబర్ ముప్పు: అప్‌డేట్స్ లేకపోవడం వలన మీ కంప్యూటర్‌కు సైబర్ దాడుల ముప్పు విపరీతంగా పెరుగుతుంది. మాల్‌వేర్‌లు (Malware), వైరస్‌లు మరియు ఇతర సైబర్ దాడులు మీ డేటాను సులువుగా దొంగిలించే అవకాశం ఉంది. మీ కంప్యూటర్ ఒక సురక్షిత రక్షణ కవచం లేకుండా సైబర్ ప్రపంచంలోకి వెళ్లినట్టే!
వ్యాపారాలపై ప్రభావం: వ్యాపారాలు రెగ్యులేటరీ కంప్లయెన్స్ (Regulatory Compliance) నిబంధనల్లో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కొన్ని రకాల సాఫ్ట్‌వేర్ పనితీరు తగ్గిపోవడం లేదా పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం కూడా ఉంది.
మీ పీసీని వెంటనే విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేయడం సాధ్యం కాకపోయినా, లేదంటే మీరు ఇంకా విండోస్ 10నే వాడుకోవాలని అనుకుంటే, మైక్రోసాఫ్ట్ ఒక తాత్కాలిక పరిష్కారాన్ని చూపించింది.
ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ కవరేజీ (ESU): మైక్రోసాఫ్ట్ ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ కవరేజీ (ESU - Extended Security Coverage) అనే అవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని ఎంపిక చేసుకుంటే, 2026 అక్టోబర్ 13 వరకూ అంటే మరో ఏడాది పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందొచ్చు.
ధరలు: వ్యాపార సంస్థలు ఒక్కో పీసీకి 61 డాలర్ల చొప్పున చెల్లించి ESUను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ మేరకు ధరలు కూడా పెరుగుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఉచిత ESU: విండోస్ 365 క్లౌడ్ పీసీల ద్వారా విండోస్ 10 వాడుతున్న వారికి మాత్రం ఉచితంగా ESU అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11కు మారాలని బలంగా కోరుతోంది. దానికి కారణాలు కూడా చెబుతోంది.
భద్రత: విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11లో సైబర్ దాడుల ముప్పు ఏకంగా 62 శాతం తక్కువ అని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
వేగం: విండోస్ 11 2.3 రెట్లు వేగంతో పనిచేస్తుందని, పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
మీ పీసీ అనుకూలత చెక్ చేసుకోండి: మీ పీసీ విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావడానికి అనుకూలమో కాదో తెలుసుకోవడానికి, సెట్టింట్స్‌లోని విండోస్ అప్‌డేట్‌ను ఎంచుకుని పీసీ హెల్త్ చెకప్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్నింటికి ఒకేసారి సపోర్ట్ నిలిచిపోవడం లేదు. కొన్ని కీలకమైన యాప్‌లకు మాత్రం మైక్రోసాఫ్ట్ మరింత సమయం ఇచ్చింది.
మైక్రోసాఫ్ట్ 365 యాప్స్: విండోస్ 10 పీసీలలోని మైక్రోసాఫ్ట్ 365 (MS 365) యాప్స్‌కు మాత్రం అక్టోబర్ 2028 వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ కొనసాగుతాయి. అయితే, ఫీచర్ అప్‌డేట్స్ మాత్రం 2026 ఆగస్టు వరకే అందుబాటులో ఉంటాయి.
డిఫెండర్ యాంటీవైరస్: విండోస్ 10 పీసీల భద్రతకు కీలకమైన మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీవైరస్‌కు కూడా ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్ అక్టోబర్ 2028 వరకూ అందుబాటులో ఉంటాయి.
ఈ అప్‌డేట్స్ ఉండటం వలన మాల్‌వేర్ ప్రొటక్షన్ మరో రెండేళ్ల పాటు కొనసాగుతుంది. అయినప్పటికీ, విండోస్ 11 వైపు మళ్లడానికి యూజర్లు తగినంత సమయం దొరికిందని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. భద్రత, వేగం దృష్ట్యా వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవడం శ్రేయస్కరం.