ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈసారి దీపావళి పండుగ కానుకగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 21వ విడత డబ్బులు కూడా అదే సమయంలో విడుదల కాబోతున్నాయి. దీంతో రాష్ట్రం, కేంద్రం కలిపి రైతుల అకౌంట్లలో ఒకేసారి నగదు జమ అవుతుందని సమాచారం. ఈసారి ఆలస్యం చేయకుండా అక్టోబర్ 18న నిధులు జమ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రైతులకు అందనున్న ఆర్థిక సహాయం మొత్తంగా గణనీయమే. కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు రూ.2,000 కాగా, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులు రూ.5,000. ఈ రెండింటిని కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 అకౌంట్‌లో జమ కానున్నాయి. దీపావళి పండుగకు ముందే ఈ నిధులు విడుదల చేయడం వల్ల రైతులకు పండుగ వేళ పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా ఇన్‌పుట్ ఖర్చులు, ఇతర అత్యవసర ఖర్చులను తీర్చుకోవడంలో ఈ డబ్బులు ఎంతగానో తోడ్పడతాయని అంచనా.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను దశలవారీగా నెరవేర్చుతోంది. ఎన్నికల సమయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకంను ప్రకటించింది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.20,000 చొప్పున మూడు విడతలుగా రైతులకు అందిస్తామని స్పష్టం చేసింది. ఇందులో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు రూ.6,000 కాగా, మిగిలిన రూ.14,000 రాష్ట్రం నుండి జమ చేయనుంది. ఆగస్టు 2న ఇప్పటికే తొలి విడతగా రూ.7,000 (రూ.5,000 రాష్ట్రం నుండి + రూ.2,000 కేంద్రం నుండి) రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి.
ఇప్పుడు రెండో విడత కింద మరో రూ.7,000 రైతుల అకౌంట్లలో జమ కానుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,000, కేంద్రం నుంచి రూ.2,000 చొప్పున రైతులకు అందుతుంది. తరువాత మూడో విడతగా రాష్ట్రం నుంచి రూ.4,000, కేంద్రం నుంచి రూ.2,000తో కలిపి రూ.6,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం మూడు విడతలుగా రూ.20,000 సహాయం రైతులకు అందించనున్నారు. దీపావళి ముందు జమ కానున్న ఈ నిధులు రైతుల పండుగ సంతోషాన్ని మరింత పెంచుతాయని భావిస్తున్నారు.