సాధారణంగా టెలికాం కంపెనీలు అందించే నెలవారీ ప్లాన్లలో 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. వినియోగదారులు ప్రతి నెలా రీఛార్జ్ చేయాల్సి రావడంతో పాటు ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో యాన్యువల్ ప్లాన్స్ వినియోగదారులకు మరింత లాభసాటి అవుతున్నాయి. ఒకసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం పొడవునా ఆందోళన లేకుండా సర్వీసులు పొందవచ్చు. అంతేకాకుండా కొంతమంది టెలికాం ఆపరేటర్లు ఒక సంవత్సరం కాకుండా అదనంగా కొన్ని రోజులు వ్యాలిడిటీ ఇస్తూ మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న వార్షిక ప్లాన్లను పరిశీలిద్దాం.
జియో వినియోగదారులకు అనేక రకాల వార్షిక రీఛార్జ్ ఆప్షన్లు అందిస్తోంది. రూ.3599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియోటీవీ, హాట్‌స్టార్ వంటి సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. అదే రూ.3999 ప్లాన్ ఎంచుకుంటే అదనంగా జియో ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఇది జియో వారి ప్రత్యేక స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ఓటీటీ సర్వీస్. ఇక జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూ.1234 ప్లాన్ అందుబాటులో ఉంది. దీంట్లో 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియోఫోన్ ప్రైమా యూజర్లకు అయితే రూ.895 ప్లాన్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.3599 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. మరో ఆప్షన్‌గా రూ.2249 ప్లాన్ ఉంది. ఇందులో వార్షిక వ్యాలిడిటీతో పాటు 30 జీబీ లంప్‌సమ్ డేటా లభిస్తుంది. ఇక వోడాఫోన్ ఐడియా వినియోగదారుల కోసం రూ.3599 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా ప్రయోజనాలు ఇస్తుంది. అదనంగా రూ.3799 ప్లాన్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. రోజుకు 1.5 జీబీ సరిపోతే రూ.3499 ప్లాన్ ఎంచుకోవచ్చు. డైలీ డేటా అవసరం లేకపోతే రూ.1999 ప్యాక్‌లో ఏడాది వ్యాలిడిటీతో 24 జీబీ డేటా లభిస్తుంది.
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా వార్షిక ప్లాన్లలో వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లు అందిస్తోంది. రూ.2399 ప్లాన్‌తో 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుండగా, రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. రూ.1999 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 600 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.1515 రీఛార్జ్ ఆప్షన్‌తో సంవత్సరం రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి.