ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తుండగా, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ స్వయంగా ఈ కేసును స్వీకరించగా, గురువారం ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో సోదాలు జరపడం రాజకీయ, ప్రజా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని దాదాపు 20 ప్రదేశాలను ఈడీ అధికారులు లక్ష్యంగా తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుల సంస్థలు, వారి కార్యాలయాలు ప్రధానంగా ఈ దాడుల కింద పడ్డాయని సమాచారం.
ఇప్పటికే సిట్ దర్యాప్తులో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా గుర్తించిన సిట్, 12 మందిని అరెస్ట్ చేసింది. వారిలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లాంటి కీలక వ్యక్తులు బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు సహా ఎనిమిది మంది ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఈడీ దర్యాప్తు ప్రారంభమవడంతో కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
కుంభకోణం వెనుక డబ్బు మార్పిడి, ఫేక్ కంపెనీలు, హవాలా లావాదేవీలు వంటి అంశాలను బహిర్గతం చేయడమే ఈడీ ప్రధాన లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. నిందితులు ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలు, వారి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించారా? నల్లధనం ఎక్కడికి మళ్లించబడింది? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనడమే ఈ దాడుల ఉద్దేశమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ఎంట్రీతో కేసు మరింత వేడెక్కింది.
రాష్ట్ర రాజకీయాలకూ ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపనుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తుతోనే ఉద్రిక్తత నెలకొన్న ఈ కేసులో ఇప్పుడు కేంద్ర సంస్థ జోక్యం వల్ల మరిన్ని రాజకీయ ఉద్వేగాలు చెలరేగే అవకాశం ఉంది. నిందితుల జాబితా, సాక్ష్యాధారాల ఆధారంగా త్వరలోనే కొత్త అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద, ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులను దాటి, దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించే దిశగా సాగుతోంది.