ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాన్వేషకులకు శుభవార్త. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) వివిధ జిల్లాల్లో 281 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భర్తీ కానున్నాయి. పదో తరగతి అర్హతతో పాటు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుండడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: చిత్తూరు జిల్లాలో 48 ఖాళీలు, తిరుపతిలో 88 ఖాళీలు, నెల్లూరులో 91 ఖాళీలు, ప్రకాశం జిల్లాలో 54 ఖాళీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) వంటి విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసినవారే అర్హులు. ఈ అప్రెంటిషిప్ ద్వారా అభ్యర్థులు ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం లభించనుంది.
దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ ఆధారంగానే ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 4, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద రూ.118 చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించిన తరువాత, నింపిన దరఖాస్తు ఫారాన్ని ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి, సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలిసి పోస్టు ద్వారా పంపించాలి. ఇవి అక్టోబర్ 6, 2025లోపు చేరాలి. చిరునామా: ప్రిన్సిపల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజి, కాకుటూరు, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా.
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను కాకుటూరు నెల్లూరు ఆర్‌టీసీ జోన్‌ల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేసి నియామకాలు చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ రంగంలో అనుభవం దొరకడం మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.