కోడిగుడ్లు అనేక పోషకాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది రోజువారీ ఆహారంలో కోడిగుడ్లను తీసుకుంటారు. అయితే, గుడ్డు లోని పచ్చని సొన (యోక్) తినే విషయంలో కొంతమంది సందేహం వ్యక్తం చేస్తారు. పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావించి దానిని వదిలేస్తారు. కానీ నిపుణులు చెబుతున్నట్లు, పచ్చ సొనను మితంగా తీసుకుంటే అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని స్పష్టం చేస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మాత్రమే పచ్చ సొనకు దూరంగా ఉండడం మంచిది.
పచ్చ సొనలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ డి, బి12, ఎ, ఇ, కే లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్, సెలీనియం, ఫాస్ఫరస్, కోలిన్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు శరీరంలోని పలు అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కోలిన్ అనే పోషకం మెదడు పనితీరును బలోపేతం చేస్తుంది. కాబట్టి పచ్చ సొనను పూర్తిగా వదిలేయకుండా మితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పచ్చ సొనలో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి కంటి చూపును కాపాడి, వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి. పచ్చ సొనలో ఉన్న విటమిన్ డి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఇక పచ్చ సొనలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అవసరమైన విటమిన్లు శోషించుకునే విధంగా పనిచేస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది, పోషకాహార లోపం ఉండదు. పచ్చ సొనలోని ఐరన్ రక్తాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. కాబట్టి, ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు రెండు కోడిగుడ్లను పచ్చ సొనతో కలిపి తినవచ్చు.
మొత్తానికి, కోడిగుడ్డు పచ్చ సొనను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ, గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం దీన్ని తగ్గించుకోవాలి. ఇతరులకు ఇది శక్తి, పోషకాలు, రోగనిరోధక శక్తి అందించే ఆహార పదార్థం. సరైన పరిమితిలో పచ్చ సొనను తీసుకుంటే ఆరోగ్యానికి అనేక లాభాలు పొందవచ్చు.