ఏపీలో కల్తీ మద్యం కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయవాడకు చెందిన అద్దేపల్లి జనార్ధన్ రావును ఎక్సైజ్ అధికారులు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఇప్పటికే అరెస్టు కావడంతో, ఇప్పుడు జనార్ధన్ రావు అరెస్ట్ కావడం కేసులో కీలక మలుపుగా మారింది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, జనార్ధన్ రావు కొంతకాలంగా ఆఫ్రికాలో ఉన్నాడు. శుక్రవారం ఆయన దక్షిణాఫ్రికా నుంచి విజయవాడకు తిరిగి వస్తున్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేశారు. ఆయన తన అనుచరుడైన రాజుతో కలిసి ములకలచెరువులోని కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారీ కేంద్రం నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఆ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించగా, సుమారు రూ.1.75 కోట్ల విలువైన కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ మద్యం వివిధ బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో తయారు చేయబడిందని తేలింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఏఎన్‌ఆర్ బార్ వద్ద కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున బాటిళ్లను రాష్ట్రంలోని లిక్కర్ షాపులకు పంపుతున్నట్లు ఆధారాలు లభించాయి.
ఈ ఘటన రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. టీడీపీకి చెందిన ఒక నేతపై కూడా ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైసీపీ–టీడీపీ మధ్య ట్వీట్ల యుద్ధం కూడా నడుస్తోంది. రాష్ట్రంలో మద్యం కల్తీ వ్యవహారం ఎంతగా విస్తరించిందనే దానిపై ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జనార్ధన్ రావు అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుందని అధికారులు చెబుతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది వ్యాపారవేత్తలు, సరఫరాదారుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా మద్యం తయారీ, పంపిణీ వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. దర్యాప్తు కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.