కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉత్పత్తి పెంచడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా “ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన”ను ప్రారంభించింది. శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు జిల్లాలు కూడా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి జిల్లాలను ధనధాన్య కృషి యోజనలో భాగంగా ఎంపిక చేశారు. ఈ జిల్లాలు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి ఉండటంతో ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. పథకం ద్వారా ఈ ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు, పంట మార్పిడి పద్ధతులు, పంట నిల్వ సదుపాయాలను మెరుగుపరచి రైతులకు లాభదాయకమైన సేద్యాన్ని అందించనున్నారు.
ఈ యోజన ప్రధానంగా రైతులకు సులభంగా రుణాలు అందించటం, పంట ఉత్పత్తిని నిల్వ చేసుకునేందుకు పంచాయతీ, మండల స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయటం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ముఖ్య లక్ష్యం. పంట మార్పిడి విధానం ద్వారా మట్టి ఫలవంతతను కాపాడుతూ, రైతులకు అధిక లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. వారు జిల్లాలో పథకం పురోగతిని పర్యవేక్షిస్తారు. దేశవ్యాప్తంగా వ్యవసాయపరంగా వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసి, అక్కడి రైతులకు సాంకేతిక సహాయం, శిక్షణ, ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా 1.7 కోట్లమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది.
ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను వచ్చే ఆరు సంవత్సరాల్లో రూ.24 వేల కోట్లతో అమలు చేయనున్నారు. మొత్తం 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ కొత్త పథకాన్ని రూపొందించారు. ఇది రైతులకు పెట్టుబడి సహాయం, బీమా భరోసా, ఉత్పాదకత పెంపు — మూడు రంగాల్లో సమగ్ర మార్పులు తీసుకువస్తుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది.