ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి మరింత దృష్టి పెట్టింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం మరియు నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో నిర్మించబడనున్నాయి.
కుప్పం విమానాశ్రయానికి 1,200 ఎకరాలు, దగదర్తి విమానాశ్రయానికి 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. దగదర్తిలో ఇప్పటికే 669.12 ఎకరాలు సేకరించగా, మిగిలిన 710.59 ఎకరాలు భూమి కోసం చర్యలు తీసుకుంటున్నారు.
దామవరం, సున్నపుబట్టి గ్రామాల పరిధిలో భూసేకరణ జరుగుతోంది. వివాదాస్పద భూములపై హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. పరిహారం అందించేందుకు లబ్ధిదారుల వివరాలు సేకరించారు.
కుప్పం విమానాశ్రయం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీన్ని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంవత్సరాల కల. 2019 జనవరిలో శంకుస్థాపన జరిగినా.. ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టు దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం నాలుగు నెలల్లో భూసేకరణ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ రెండు విమానాశ్రయాల ప్రాజెక్టుల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల ఖర్చును భరించేందుకు హడ్కో నుండి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదనలు సమర్పించగా, కేబినెట్ వాటిని ఆమోదించింది.
నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ ఆమోదంతో, ఈ కల నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భూసేకరణ చివరి దశకు చేరుకోవడంతో, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ప్రభుత్వం కుప్పం, దగదర్తి మాత్రమే కాకుండా శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలు ప్రాంతాల్లో కూడా కొత్త విమానాశ్రయాల ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ చర్యలతో రాబోయే సంవత్సరాల్లో ఏపీ రవాణా సదుపాయాలు విస్తరించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.