రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మీడియా ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపే బలమైన వంతెన. అమరావతి ప్రెస్ క్లబ్‌కు అవసరమైన సదుపాయాల విషయంలో ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుంది. మీడియా సమాజ అభివృద్ధికి తోడ్పడే శక్తి అని చెప్పారు.
ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అప్పాజీ, సతీష్ బాబు, నారాయణ తదితరులు క్లబ్ కోసం స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
2018లో ఏర్పడిన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యమై పనిచేస్తోంది. రాజధాని నిర్మాణం, ప్రజల అవసరాలు, ప్రభుత్వ ప్రణాళికలను ప్రజల ముందుకు తీసుకువస్తూ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశం కూడా చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ రూపొందించిన మన చంద్రన్న – 2 డిజిటల్ పుస్తకం ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరంగా ఉన్నాయి. ప్రజల మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గ్రామాల అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ఇందులో అద్దం పట్టినట్టు చూపించారు.
చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి రంగం నుంచి సహకారం అవసరం. మీడియా కూడా ఈ క్రమంలో భాగస్వామిగా ఉంటే ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించవచ్చు. అభివృద్ధి కోసం మేము తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉంటాయి అని అన్నారు.

ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వారు మాట్లాడుతూ, అమరావతిలో మీడియా వృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశం. ప్రెస్ క్లబ్‌కు శాశ్వత స్థలం లభిస్తే, జర్నలిస్టులకు ఉపయోగకరమైన వాతావరణం ఏర్పడుతుంది అన్నారు.