రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వరుసగా కలవడం కలకలం రేపుతోంది. ఆదివారం కొన్ని గంటల తేడాతో ఈ ఇద్దరూ రాష్ట్రపతితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, ఈ భేటీల ఉద్దేశ్యంపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో ఉత్కంఠ మొదలైంది.
ఈ సమావేశాలు జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న చర్చల నేపథ్యంలో జరుగుతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దయిన ఆరేళ్ల అనంతరంగా ఇలాంటి హైలెవల్ భేటీలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల బ్రిటన్, మాల్దీవుల పర్యటనల అనంతరం ప్రధాని మోదీ తొలిసారిగా రాష్ట్రపతిని కలవగా, కొద్ది గంటల తరువాత అమిత్ షా కూడా భేటీ అయ్యారు. ఆ వెంటనే హోంమంత్రి జమ్మూ కశ్మీర్ నాయకులను కలవడం మరింత ఆసక్తికరంగా మారింది.
కేంద్రం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇప్పుడు అదే తేదీకి రెండు రోజుల ముందు ఈ కీలక భేటీలు జరగడం రాజకీయంగా కీలక సంకేతాల్లా మారాయి.
ప్రత్యక్షంగా గడువు నిర్ణయించకపోయినా, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పలుమార్లు హామీ ఇచ్చిన విషయాన్ని మరవలేం.