ఎరుపు రంగు పాలకూర (Red Spinach) అనేది మనం తరచూ చూడగలిగే ఆకుపచ్చ పాలకూరకు భిన్నమైన వెరైటీ. సాధారణంగా పాలకూర అంటే ఆకుపచ్చ ఆకులు ఊహకు వస్తాయి కానీ, మార్కెట్లో ముదురు ఊదా లేదా ఎరుపు రంగులో ఉండే పాలకూర కూడా లభిస్తుంది. దీనిలో *ఆంథో సయనిన్స్* అనే పదార్థాలు అధికంగా ఉండటంతో ఈ ఆకుకూరకు ప్రత్యేకమైన రంగు వస్తుంది. ఇదే పదార్థాలు శరీరానికి అత్యంత మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా సయనిన్స్ వంటివి అధికంగా ఉండటంతో, ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది. ముఖంపై ముడతలు తగ్గడం, కాంతివంతమైన చర్మం రావడం వంటి ప్రయోజనాలు కనిపిస్తాయి.
ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఈ ఎరుపు పాలకూర ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని నైట్రేట్స్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలను విశ్రాంతి స్థితిలో ఉంచుతాయి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, బీపీ అదుపులో ఉంటుంది, గుండె పనితీరు బాగా మెరుగవుతుంది. రోజూ శారీరక శ్రమ చేసే వారికీ ఇది శక్తిని తిరిగి పొందేలా సహాయపడుతుంది. ఎరుపు పాలకూరలో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది లాభం చేకూరుస్తుంది. అందువల్ల, ఈ ఆకుకూరను కూడా తరచూ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.