టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శ్రీవాణి టికెట్ల కోసం నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు కొత్త టోకెన్ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో నిలబడి ఉదయం 8 గంటలకు టికెట్లు పొందాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భక్తులు అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద టోకెన్లు తీసుకోవచ్చు.
టోకెన్ తీసుకునే సమయంలో భక్తుల ఆధార్ జిరాక్స్‌పై సంతకం చేసి స్టాంప్ వేస్తారు. ఈ టోకెన్లు పొందిన వారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 లోపు ఎప్పుడైనా కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. సాయంత్రం 4.30కి దర్శనానికి అనుమతిస్తారు. రాబోయే రోజుల్లో ఈ టోకెన్ బదులుగా చేతికి కంకణం వేసే విధానం అమలు చేసే ఆలోచనలో టీటీడీ ఉంది.
ప్రస్తుతం శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్ ద్వారా 500, ఆఫ్‌లైన్‌లో ఎయిర్‌పోర్ట్ ద్వారా 200, తిరుమలలో 800 అందిస్తున్నారు. భక్తుల నుంచి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆఫ్‌లైన్‌లో మరో 400 టికెట్లు అదనంగా కేటాయించేందుకు టీటీడీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కొత్త టోకెన్ విధానం ద్వారా భక్తులు క్యూలో ఎక్కువసేపు వేచి ఉండే ఇబ్బందులు తొలగి, దర్శన ఏర్పాట్లు మరింత సులభతరం కానున్నాయి.