ప్రపంచ ఆటోమొబైల్ రంగం మరోసారి ఆశ్చర్యానికి గురైంది. చైనాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYDకి చెందిన U9 ఎక్స్‌ట్రీమ్ (U9 Xtreme) మోడల్ కారు తన అద్భుత వేగంతో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 496.22 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంతో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్‌గా గుర్తింపు పొందింది. ఈ ఘనత జర్మనీలోని ప్రసిద్ధ ఆటోమోటివ్ టెస్టింగ్ పాపెన్బర్గ్ (ATP) ట్రాక్లో నమోదు కావడం ప్రత్యేకత.
ఇప్పటి వరకు ఈ రికార్డు బుగట్టి చిరోన్ (Bugatti Chiron) పేరిట ఉండేది. బుగట్టి కార్ 490.5 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు సాధించింది. కానీ ఇప్పుడు BYD సంస్థ తన ఎలక్ట్రిక్ సాంకేతికతతో, అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఆ రికార్డును అధిగమించి ఆటోమొబైల్ చరిత్రలో కొత్త పుట రాసింది.
ఎలక్ట్రిక్ కార్లపై గత కొన్నేళ్లుగా ఉన్న విమర్శల్లో ఒకటి ఇవి పెట్రోల్, డీజిల్ ఆధారిత హైపర్ కార్ల మాదిరిగా అత్యధిక వేగాన్ని సాధించలేవన్నది. అయితే BYD U9 ఎక్స్‌ట్రీమ్ సాధించిన ఈ రికార్డు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా చెరిపేసింది. కేవలం పర్యావరణహితమైన వాహనమే కాకుండా, అత్యుత్తమ పనితీరును కూడా అందించగలదని ఈ కారు నిరూపించింది.
ఈ కారు డిజైన్, ఏరోడైనమిక్స్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీ కలిపి ఈ రికార్డుకు కారణమయ్యాయి. ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం, ఇది భవిష్యత్ రవాణా రంగానికి ఒక కొత్త దిశను చూపించింది. వేగం, సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ సమతౌల్యంగా కలగలిపిన వాహనంగా U9 ఎక్స్‌ట్రీమ్ నిలిచింది.
BYD ఈ విజయంతో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా హైపర్ కార్లను ప్రేమించే వారిలో ఈ రికార్డు సంచలనం రేపింది. ఇకపై ఆటోమొబైల్ రేసులు, టెస్టింగ్ ట్రాక్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం మరింత పెరగడం ఖాయం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.