ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పెద్ద శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మీనగర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు ఈ కొత్త కార్డులను స్వయంగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15వ తేదీ కల్లా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కొత్తగా కార్డు తీసుకున్నవారికి, చిరునామా మార్పు చేసుకున్నవారికి కూడా ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రేషన్ షాపుల ద్వారా గోధుమలు కూడా ఇవ్వబోతున్నామని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రి మనోహర్ మాట్లాడుతూ, చౌకబియ్యం దుర్వినియోగం జరగకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. ప్రతి కార్డు క్యూఆర్ కోడ్‌తో ఉండటంతో, రేషన్ తీసుకున్న వెంటనే సమాచారం కేంద్ర, జిల్లా కార్యాలయాలకు చేరుతుందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,797 రేషన్ షాపులు ఉన్నాయని, ప్రజల అవసరాల మేరకు వీటి సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా అవసరమైన చోట సబ్ డిపోలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
ఈ స్మార్ట్ రేషన్ కార్డులను వినియోగించే విధానం కూడా ప్రత్యేకం. రేషన్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న కొత్త ఈ-పోస్ యంత్రాలు సిమ్, వైఫై, బ్లూటూత్, హాట్‌స్పాట్, టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లతో పనిచేస్తాయి. ఒకవేళ లబ్ధిదారుడి వేలిముద్ర పనిచేయకపోతే, కెమెరా ద్వారా ఐరిస్ స్కాన్ చేయవచ్చు. అలాగే జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే కార్డు వివరాలు కనిపిస్తాయి. కార్డులో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ లోగో, లబ్ధిదారు ఫోటో, రేషన్ నంబర్ ఉంటే, మరోవైపు కుటుంబ సభ్యుల వివరాలు ముద్రించబడ్డాయి.