భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు 25 శాతం ఉన్న సుంకాన్ని వాషింగ్టన్ ప్రభుత్వం 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాభాలు తగ్గిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోవడం వల్ల వాణిజ్య మంత్రిత్వశాఖకు ఇప్పటికే పలువురు ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఆగస్టు 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షత వహించే అవకాశముందని సమాచారం. ఎగుమతిదారులకు ఊరట కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో అమలైన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ తరహాలో కొత్త పథకం అవసరమని ఎగుమతిదారులు కోరుతున్నారు.
అయితే అందరికీ ఒకే రకం సహాయం ఇవ్వడం కంటే, అత్యధికంగా నష్టపోతున్న కొన్ని రంగాలను గుర్తించి వాటికి ప్రత్యేక సాయం అందించడం మేలని ప్రభుత్వం భావిస్తోంది. క్లస్టర్‌ల వారీగా వర్కింగ్ క్యాపిటల్ ఫండ్స్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా పరిశీలనలో ఉంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆస్తుల హామీతో రుణ సదుపాయాలు కల్పిస్తే మేలు జరుగుతుందని మైక్రో పరిశ్రమల ప్రతినిధులు సూచించారు. మొత్తానికి విదేశీ మార్కెట్ల ప్రభావం ఎక్కువగా పడే ఈ పరిశ్రమలను కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.