ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు సిబ్బందికి దసరా సందర్భంగా శుభవార్త అందింది. గతంలో నిలిపివేసిన గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమా (GPAI) పాలసీని మరోసారి పునరుద్ధరించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బెంగళూరులోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో కొత్త ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఅండ్‌ఎల్ విభాగం ఐజీ రవిప్రకాశ్, భద్రత సెక్రటరీ హరికుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం రూ.7.68 కోట్ల ప్రీమియం చెక్కును డీజీపీ కంపెనీ ప్రతినిధులకు అందజేయగా, ఈ పాలసీ సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది.
ఈ పాలసీ కింద హోంగార్డుల నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీసు సిబ్బంది అందరికీ ప్రమాద బీమా వర్తిస్తుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతే వారి ర్యాంకు ఆధారంగా రూ.10 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు బీమా సాయం అందుతుంది. హోంగార్డులకు రూ.10 లక్షలు, కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ వరకు రూ.25 లక్షలు, సబ్‌ఇన్‌స్పెక్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు రూ.35 లక్షలు, ఇక ఎస్పీ నుంచి డీజీపీ హోదా వరకు ఉన్నవారికి రూ.45 లక్షల బీమా లభిస్తుంది. ఈ విధానం వల్ల పోలీసు సిబ్బంది కుటుంబాలకు భద్రతా పరమైన అండ లభిస్తుందని అధికారులు తెలిపారు.
డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ – “శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు పణంగా పెట్టే పోలీసు సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది” అని అన్నారు. గతంలో ఆపేసిన GPAI పాలసీని ఇప్పుడు తిరిగి ప్రారంభించడం పోలీసు శాఖకు సంతోషకరమని పేర్కొన్నారు. కేవలం విధి నిర్వహణలో జరిగే ప్రమాదాలు మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనల్లో కూడా ఈ పాలసీ కింద సహాయం అందుతుందని స్పష్టం చేశారు. ఈ పాలసీని మరో ఏడాది పాటు పొడిగించినట్లు డీజీపీ వెల్లడించారు.
ఇక మరోవైపు, ఏపీ ప్రభుత్వం పట్టణాభివృద్ధి సంస్థల (UDA) ఛైర్మన్ల పదవీకాలాన్ని రెండు సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వీరి పదవీకాలం ఒక్క ఏడాది మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని మరింత కాలం కొనసాగిస్తూ, 2024 నవంబరు, 2025 మార్చి, మే నెలల్లో నియమితులైన శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, అనంతపురం–హిందూపురం వంటి పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో, నియమిత ఛైర్మన్లు తమ బాధ్యతలను కొనసాగిస్తూ నగరాభివృద్ధి ప్రణాళికలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కింది.