నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు, దీపావళి పండుగలతో తెలుగు రాష్ట్రాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. ఈ పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేకంగా వస్త్రాలు కొనుగోలు చేసే ప్రజలకు 40 శాతం తగ్గింపును అందజేస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ ఆఫర్ వినియోగదారులకు తక్కువ ధరలకు వస్త్రాలు అందిస్తే, మరోవైపు నేత కార్మికుల ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరగనుందని తెలిపారు.
చేనేత ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల నేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల చేనేత సహకార సంఘాల సభ్యుల ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా రూ.3000 వరకు ఆదాయం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 89 వేల మంది నేత కార్మికులు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దీని వలన నేత కార్మికులు మరింత ఉత్సాహంగా పని చేసి అధిక ఉత్పత్తి చేయగలరని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా, చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నారు. పండగ సీజన్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు చేనేత ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. రాష్ట్రంలోని 92 వేల మంది నేతలకు 50 ఏళ్ల వయసులోనే పింఛను అందించడం ద్వారా ప్రభుత్వం నేతన్నల భద్రతకూ కట్టుబడి ఉందని మంత్రి సవిత వివరించారు. ఈ విధంగా పింఛను పథకం నేత కార్మికుల జీవితాలకు స్థిరత్వం తెచ్చి భవిష్యత్‌లో వారికి ఆర్థిక భరోసా కలిగిస్తుందని చెప్పారు.
ఆప్కో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తాజాగా విశాఖలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆధునిక మార్కెటింగ్ వ్యూహాలు, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఆప్కోలో అమలు చేయనున్నారు. దీంతో చేనేత వస్త్రాల విక్రయాలు మరింత పెరిగి నేతన్నలకు శాశ్వత ఉపాధి లభించనుంది. పండగ సీజన్ ఆఫర్లు ఈ ప్రయత్నంలో భాగమని మంత్రి సవిత పేర్కొన్నారు. నేతన్నల కష్టానికి తగిన గౌరవం దక్కేలా, చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.