మధ్యతరగతి కుటుంబాల్లో బాగా చదివే పిల్లలకు సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనే కల ఉంటుంది. కానీ వారి ఆర్థిక పరిస్థితుల వల్ల అందరికీ అది సాధ్యం అవ్వడం లేదు. సివిల్స్‌కి సిద్ధం కావాలంటే మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకోవాలి. ఆ సెంటర్‌లో పూర్తి సమాచారం ఉందా టీచర్లు బాగా చదివించగలరా, ఫీజు ఎంత అనేది కూడా చూడాలి అన్ని బాగున్నాయంటే ఫీజు లక్షల్లో ఉంటుంది.
సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన బీసీ అభ్యర్థులు ఇప్పుడు సివిల్స్ కోచింగ్‌ను ఉచితంగా పొందగలుగుతారు. ప్రభుత్వ సహకారంతో, తమ కలలను సాధించడానికి వీలుగా ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
గత సంవత్సరం 83 మంది అభ్యర్థులకు సివిల్స్ కోచింగ్ ఇచ్చిన ప్రభుత్వం, ఈసారి మరో 100 మందికి ఉచితంగా కోచింగ్ అందించనుంది. సివిల్స్ మాత్రమే కాకుండా, ఇతర వివిధ పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ అందించే కార్యక్రమం ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు.
ఈ ఉచిత కోచింగ్ పథకం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అమలు చేయబడుతుంది. రాష్ట్రంలోని బీసీ అభ్యర్థులు రిజిస్టర్ అయి, ఫ్రీ శిక్షణ పొందగలుగుతారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అత్యున్నత స్థాయి పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమవుతారు ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వ కాలంలో, కూటమి ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇప్పటికే ప్రారంభమైన బ్యాచ్‌లో 83 మంది అభ్యర్థులకు కోచింగ్ అందించగా, కొత్త బ్యాచ్‌లో మరో 100 మంది ఉచిత శిక్షణ పొందనున్నారు అని డీఎస్సీ కోర్సులకు కూడా బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుంది అని తెలిపారు.
భవిష్యత్తులో విద్యార్థులకు మరింత సౌకర్యం కోసం అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మించనున్నారు. ఈ నిర్ణయంపై బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం బలహీన వర్గాల విద్యార్థుల కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చొరవ అని విశ్లేషకులు భావిస్తున్నారు.