ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పటంలో విశాఖపట్నం ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తోంది. సముద్రతీర సౌందర్యంతో పాటు పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన వైజాగ్, ఇప్పుడు దేశంలోనే అత్యంత పెద్ద ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదుగుతోంది. ఇటీవల ప్రకటించిన పలు భారీ ప్రాజెక్టులతో ఈ నగరం “ఆంధ్రప్రదేశ్ ఐటీ క్యాపిటల్”గా అవతరించడానికి రంగం సిద్ధమైంది.
ముఖ్యంగా, గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech వైజాగ్‌లో ₹87,520 కోట్ల పెట్టుబడిని ప్రకటించడం సెన్సేషన్‌గా మారింది. ఇది ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యంత పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) గా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆధునిక డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI లాబ్స్, సైబర్ సెక్యూరిటీ సెంటర్లు నిర్మించబడనున్నాయి. వీటితోపాటు స్థానిక యువతకు 40,000కుపైగా ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
విశాఖలో ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సిఫీ టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్థలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. TCS వైజాగ్‌లో కొత్త డేటా సెంటర్ మరియు డెవలప్‌మెంట్ హబ్ను ఏర్పాటు చేస్తోంది. సిఫీ కూడా ఇక్కడ హైపర్-స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ రెండు సంస్థలు కలిపి దాదాపు ₹10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి.
ఇక మరోవైపు, అదానీ గ్రూప్ కూడా విశాఖపట్నంలో భారీ టెక్ పార్క్ ప్రాజెక్టును ₹21,844 కోట్లతో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఇన్నోవేషన్ టవర్స్, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు, కో-వర్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధుల ప్రకారం, ఈ టెక్ పార్క్ దేశంలోనే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఐటీ హబ్‌లలో ఒకటిగా అవతరించనుంది.
అంతేకాదు, సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా (ఫేస్‌బుక్) కూడా వైజాగ్‌లో తన అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కేబుల్ ద్వారా భారత్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం దేశాలను కలిపే హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పడనుంది. దీని ద్వారా విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌లో కీలక హబ్‌గా మారనుంది. ఈ పెట్టుబడుల వెల్లువతో వైజాగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గణనీయమైన మార్పు రానుంది. నగరంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిన్‌టెక్ వాలీ, టెక్ సిటీ ప్రాజెక్ట్, ఈ-గవర్నెన్స్ హబ్లను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు వేగవంతంగా సాగుతుండటంతో, పెట్టుబడిదారుల్లో విశాఖపై నమ్మకం పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందని ఐటీ, మంత్రి తెలిపారు. విశాఖను సిలికాన్ వ్యాలీలా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే అనేక గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 2026 నాటికి వైజాగ్‌ను దేశంలో టాప్-3 టెక్ నగరాల్లో ఒకటిగా మారుస్తాం” అని ఆయన ప్రకటించారు.
ఈ ప్రాజెక్టులతో పాటు నగరంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్, మెట్రో రైలు ప్రాజెక్ట్, గ్రీన్ ఎనర్జీ హబ్, స్మార్ట్ సిటీ ఫెసిలిటీస్ వంటి పలు కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయి. ఈ అభివృద్ధి దిశలో వైజాగ్ ఇప్పుడు ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మారిపోయింది. విశాఖపట్నం ఒకప్పుడు కేవలం పోర్ట్ సిటీగా మాత్రమే పేరుపొందింది. కానీ ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక, పరిశ్రమల రంగాల్లో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటోంది. సముద్రతీర నగరం నుంచి సిలికాన్ తీర నగరంగా మారుతున్న వైజాగ్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తోంది.