గల్ఫ్ ప్రాంతంలో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధలతో, విశేషంగా జరిగాయి. మాతృదేశంలోని ఆర్భాటం లేకపోయినా, ఆధ్యాత్మిక వాతావరణంలో గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ముఖ్యంగా దుబాయితో సహా గల్ఫ్ అరేబియా దేశాల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎన్నారైలు ముందుండి ఈ వేడుకలను నడిపించారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు ఏకతాటిపై నిలిచి ఆరాధన చేశారు.
దుబాయ్‌లోని సోనాపూర్ ప్రాంతంలో ఏకదంతుని విగ్రహ ప్రతిష్ఠ, నిమజ్జన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రవాసీయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రోజుకు ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు. నిమజ్జనానికి ముందు భోజన విందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు చెందిన దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. నిర్వాహకుల్లో తాడేపల్లిగూడెం మండలం దర్శిపురానికి చెందిన పంతం సుబ్బరాజు ప్రధాన పాత్ర పోషించారు.
గత దశాబ్ద కాలంగా సోనాపూర్‌లో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన క్యాంప్ బాస్ అబ్దుల్ నాసర్ సహకారంతో గోదావరి జిల్లాల ప్రవాసీయులు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. రాంబాబు, నాగబాబు, ఫణీంద్ర, రాజమండ్రి శ్రీను, కె.వి.రెడ్డి, వెంకటరెడ్డి వంటి ఎన్నారైలు కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ వేడుకలు దుబాయ్‌లో "మినీ భారత్" అనిపించేలా నిర్వహించబడుతున్నాయి.

ఈ సందర్భంలో ప్రత్యేక సేవలు అందించిన వారిలో రామారావు 8 వేల మందికి వంట చేసి విశేషంగా నిలిచారు. కొండ బాబు, రామారావులు పూజారులుగా వ్యవహరించారు. అలాగే పాలకొల్లుకు చెందిన శివ, కరీంనగర్‌కు చెందిన వినోద్ నేతృత్వంలోని భజన మండలి సాంప్రదాయ గీతాలతో భక్తులను అలరించింది. మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్లు బహూకరించడం ద్వారా వారికి గౌరవం తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ వేడుకల్లో క్రైస్తవ, ముస్లిం మతస్థులు కూడా సహకరించడం విశేషం. క్రైస్తవుడైన ఏసు, ముస్లింను చెందిన అబ్దుల్ నాసర్ సహాయం ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సాంప్రదాయాలను కాపాడటంలో, సమాజానికి ఏకతను చాటటంలో ఈ వేడుకలు ఒక మంచి ఉదాహరణగా నిలిచాయి.