ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీపం-2 పథకం కింద రాష్ట్రంలోని 23,912 గిరిజన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మరియు 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2017లో వీరికి 5 కిలోల సిలిండర్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మరింత పెద్ద సౌకర్యం కల్పిస్తూ, ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించనుంది.
ఈ పథకానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కలిపి సుమారు రూ.5.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మొత్తం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో గిరిజన కుటుంబాలకు ఎటువంటి భారమూ లేకుండా పెద్ద సిలిండర్లు లభించనున్నాయి.
కొండప్రాంతాల్లో రవాణా సమస్యలు, చిన్న సిలిండర్లతో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల గిరిజన కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో లభించనుంది.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనితో రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని గిరిజన కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. చిన్న సిలిండర్లు వాడుతున్న వారికి ఈ కొత్త పథకం పెద్ద ఉపశమనాన్ని అందిస్తుంది.
గతేడాది నుంచి అమలవుతున్న దీపం-2 పథకాన్ని ఇప్పుడు గిరిజనులకు కూడా వర్తింపజేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల ప్రజలకు వంట గ్యాస్ మరింత సులభంగా అందుబాటులోకి రానుంది.