ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకొచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి క్వింటాల్ ఉల్లిని రూ.1200 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ ఉల్లిని ప్రజలకు తక్కువ ధరలో అందించాలని నిర్ణయం తీసుకుంది.
కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఉల్లిని కిలో రూ.2కే విక్రయించడం ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డుకి చేరుకుని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు. 45 కేజీల ఉల్లి బస్తాను కేవలం రూ.100కే అందిస్తున్నారు. దీంతో ప్రజలకు ఉపశమనం లభించగా, రైతులకూ ఊరట లభించింది.
ఈ ఏడాది వర్షాలు ముందుగానే పడటంతో రైతులు ఉల్లి సాగులో పెద్ద ఎత్తున ప్రవేశించారు. దీంతో పంట ముందుగానే మార్కెట్‌కి వచ్చింది. దిగుబడి పెరగడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొనుగోలుదారులు లభించక రైతులు పంటను వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేశారు.
ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి మద్దతు ధరను ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా పెద్ద ఎత్తున ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు 13 వేల టన్నుల పంట కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులో 4 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, పోలీసుల సహకారంతో సజావుగా విక్రయాలు జరుగుతున్నాయి.
రైతుల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో రైతులు కొంత ఆర్థిక భారం నుండి బయటపడతారని, ప్రజలకు కూడా తక్కువ ధరలో ఉల్లి లభించడం వల్ల ఉపశమనం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.